అర్జున విషాదయోగః 5 (అథ ప్రథమోధ్యాయః, శ్రీ భగవద్గీత)

అర్జున విషాదయోగః 5 (అథ ప్రథమోధ్యాయః, శ్రీ భగవద్గీత)

తస్మాన్నార్హావయం హంతుం
ధార్తరాష్ట్రాంస్వబాంధవాన్‌,
స్వజనం హి కథం హత్వా
సుఖిన స్స్యామ మాధవ!

ఓ కృష్ణా! కావున మన బంధువులగు దుర్యోధనాదులను చంపుటకు మనము తగము. మనవారిని చంపి మన మెట్లు సుఖపడగలము?

యద్యప్యేతే న పశ్యంతి
లోభోపహతచేతసః,
కులక్షయకృతం దోషం
మిత్రద్రోహేచ పాతకమ్‌.

కథం న జ్ఞేయమస్మాభిః
పాపాదస్మా న్నివర్తితుమ్‌,
కులక్షయకృతం దోషం
ప్రపశ్యద్భిర్జనార్దన!

ఓ కృష్ణా! రాజ్యలోభముచే భ్రష్టచిత్తులైన దుర్యోధనాదులు వంశనాశనము వలన గలుగు దోషమును, మిత్రద్రోహము వలన గలుగు పాపమును, ఒకవేళ యెఱుగకున్నను, ఆ రెండింటిని బాగుగ తెలిసినట్టి మనమేల యీ పాపకృత్యమునుండి విరమింపగూడదో అర్థము కాకున్నది.

కులక్షయే ప్రణశ్యంతి
కులధర్మాస్సనాతనాః,
ధర్మేనష్టే కులం కృత్స్న
మధర్మోభిభవత్యుత.

అధర్మాభిభవాత్కృష్ణ!
ప్రదుష్యంతి కులస్త్రియః,
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ!
జాయతే వర్ణ సంకరః.

సంకరో నరకాయైవ
కులఘ్నానాం కులస్య చ,
పతంతి పితరో హ్యేషాం
లుప్తపిణ్డోదకక్రియం.

ఓ కృష్ణా! కులము నశించుటచే అనాదిగ వచ్చు కులధర్మములు అంతరించిపోవును. ధర్మము నశించుటచే కులమంతటను అధర్మము వ్యాపించును. అధర్మము వృద్ధినొందుటచే, కులస్త్రీలు చాల చెడిపోవుదురు. స్త్రీలు చెదిపోవుటచే వర్ణసంకర మేర్పడును. అట్టి వర్ణసంకరము వలన సంకరము చేసినవారికి, సంకరమునొందిన కులమునకు గూడ నరకము సంప్రాప్తించును. వారి పితృదేవతలు శ్రాద్ధములు, తర్పణములు లేనివారై యథోగతిని బొందుదురు.

దోషై రేతైః కులఘ్నానాం
వర్ణసజ్కరకారకైః
ఉత్సాద్యంతే జాతిధర్మాః
కులధర్మశ్చ శాశ్వతాః.

ఉత్సన్న కులధర్మాణాం
మనుష్యాణాం జనార్దన!
నరకే నియతం వాసో
భవతీత్యనుశుశ్రుమ.

ఓ కృష్ణా! కులనాశకులయొక్క జాతిసాంకర్యహేతువులైన ఈ దోషముల చేత శాశ్వతములగు జాతి ధర్మములు, కులధర్మములు నశించుపోవుచున్నవి. కుల ధర్మములు నశించిన మానవులకు శాశ్వత నరక నివాసము కలుగునని మనము వినియున్నాము.

అహో! బత! మహత్పాపం
కర్తుం వ్యవసితావయమ్‌,
యద్రాజ్యసుఖలోభేన
హంతుం స్వజన ముద్యతాః.

కటకటా! రాజ్యసుఖమందలి యాశచే మనము బంధువులను చంపుట కుద్యమించి మహాపాపమును చేయుటకు సమకట్టితిమి కదా!.

యది మామప్రతీకార
మశస్త్రం శస్త్రపాణయః
ధార్తరాష్ట్రా రణే హన్యు
స్తన్మే క్షేమతరం భవేత్‌.

ఆయుధములు ధరింపకయు, ఎదిరించకయునున్న నన్ను ఆయుధములు చేబూనిన దుర్యోధనాదు లీయుద్ధమున జంపుదు రేని అది నాకు మరింత క్షేమమైనదియే యగును.

సఞ్జయ ఉవాచ:-

ఏవముక్త్వార్జునస్సజ్ఞ్యే
రథోపస్థ ఉపావిశత్‌,
విసృజ్య సశరం చాపం
శోక సంవిగ్న మానసః

సంజయుడు చెప్పెను - (ఓ ధృతరాష్ట్ర మహారాజా!) యుద్ధభూమియం దర్జును డీప్రకారముగ జెప్పి, శోకముచే కలతనొందిన చిత్తముగలవాడై, బాణముతో గూడిన వింటిని పారవైచి రథముపై చతికిలబడెను.

ఇతి శ్రీమద్భావద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణారునసంవాదే, అర్జున విషాదయోగోనామ ప్రమమోధ్యాయః 

అర్జున విషాదయోగః 4 (అథ ప్రథమోధ్యాయః, శ్రీ భగవద్గీత)

అర్జున విషాదయోగః 4 (అథ ప్రథమోధ్యాయః, శ్రీ భగవద్గీత)

అర్జున ఉవాచ :-

దృష్ట్వేమం స్వజనం కృష్ణ!
యుయుత్సుం సముపస్థితమ్‌.

సీదంతి మమ గాత్రాణి
ముఖం చ పరిశుష్యతి,
వేపథుశ్చ శరీరే మే
రోమహర్షశ్చ జాయతే.

గాణ్డీవం స్రంసతే హస్తా
త్త్వక్చైవ పరిదహ్యతే,
న చ శక్నోమ్యవస్థాతుం
భ్రమతీవ చ మే మనః‌

అర్జునుడు చెప్పెను. ఓ కృష్ణమూర్తి! యుద్ధము చేయుటకై ఇచట సమకూడిన ఈ బంధుజనములను జూచి నా అవయవములు పట్టుదప్పుచున్నవి; నోరెండుకొని పోవుచున్నది; శరీరమందు వణకుపుట్టుచున్నది; గగుర్పాటు గలుగుచున్నది; గాండీవము చేతినుండి జారిపోవుచున్నది; చర్మము మండుచున్నది; నిలబడుటకైనను నాకు శక్తిలేకున్నది; మనస్సు గిఱ్ఱున తిరుగుచున్నది.

నిమిత్తాని చ పశ్యామి
విపరీతాని కేశవ!
న చ శ్రేయోనుపశ్యామి
హత్వా స్వజనమాహవే.

ఓ కృష్ణమూర్తీ! (పెక్కు) అపశకునములను సహితము చూచుచున్నాను. యుద్ధమునందు బంధువులను చంపిన వెనుక బొందబోవు లాభమెద్దియో నాకు గనుపించుటలేదు.

న కాజ్క్షే విజయం కృష్ణ!
న చ రాజ్యం సుఖాని చ,
కిం నో రాజ్యేన గోవింద!
కిం భోగైర్జీవితేన వా.

కృష్ణా! నేను విజయమునుగాని, రాజ్యమునుగాని, సుఖమునుగాని కోరను. రాజ్యముతోగాని, భోగములతోగాని, జీవితముతోగాని మనకేమి ప్రయోజనము?

యేషామర్థే కాజ్క్షితంనో
రాజ్యం భోగాస్సుఖాని చ,
త ఇమేవస్థితా యుద్ధే
ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ.

ఆచార్యాః పితరః పుత్రా
స్తథైవ చ పితామహాః,
మాతులా శ్శ్వశురాః పౌత్రా
స్స్యాలా స్సంబంధిన స్తథా.

ఎవరి నిమిత్త మీ రాజ్యమును, భోగములను, సుఖములను మనము కోరుదుమో, అట్టి గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమండ్రు, బావమరుదులు, సంబంధులు ఎల్లరునూ ప్రాణములమీద, ధనముమీద ఆశ వదలుకొని ఈ రణరంగము మీద వచ్చి నిలబడియున్నారు.

ఏతాన్న హంతుమిచ్ఛామి
ఘ్నతోపి మధుసూదన!
అపి త్రైలోక్యరాజ్యస్య
హేతోః కిం ను మహీకృతే.

ఓ కృష్ణా! నన్ను చంపువారలైనను వీరిని ముల్లోకముల రాజ్యాధిపత్యము కొరకైనను నేను చంపనిశ్చగింపను. ఇక భూలోకరాజ్యము కొరకు వేరుగ జెప్పవలెనా?.

నిహత్య ధార్తరాష్ట్రాన్నః
కా ప్రీతి స్స్యాజ్జనార్దన!
పాపమేవాశ్రయేదస్మాన్‌‌
హత్వైతా నాతతాయినః.

ఓ కృష్ణా! దుర్యోధనాదులను చంపుటచే మన కేమి సంతోషము కలుగును? దుర్మార్గులైనను వీరిని చంపుట వలన మనకు పాపమే కలుగును. 

అర్జున విషాదయోగః 3 (అథ ప్రథమోధ్యాయః, శ్రీ భగవద్గీత)

అర్జున విషాదయోగః 3 (అథ ప్రథమోధ్యాయః, శ్రీ భగవద్గీత)

స ఘోషో ధార్తరాష్ట్రాణాం
హృదయాని వ్యదారయత్‌,
నభశ్చ పృథివీంచైవ
తుములో వ్యనునాదయన్‌

పాండవవీరుల శంఖములయొక్క ఆ సంకులధ్వని భూమ్యాకాశములను దద్దరిల్లుజేయుచు దుర్యోధనాదుల గుండెలను బ్రద్దలు చేసెను.

అథ వ్యవస్థితాన్‌ దృష్ట్వా
ధార్తరాష్ట్రాన్‌ కపిధ్వజః,
ప్రవృత్తే శస్త్రసంపాతే
ధనురుద్యమ్య పాణ్డవః.

హృషీకేశం తదా వాక్య
మిదమాహ మహీపతే!

ఓ ధృతరాష్ట్ర మహారాజా! అటుపిమ్మట రణరంగమున ఆయుధములు ప్రయోగింపబడబోవుచుండగా కపిధ్వజుడగు అర్జునుడు యుద్ధసన్నద్ధులైయున్న కౌరవులను జూచి, ధనుస్సును చేబూని శ్రీకృష్ణునితో నిట్లు పలికెను - 

అర్జున ఉవాచ : -

సేనయోరుభయోర్మధ్యే
రథం స్థాపయ మేచ్యుత!

యావదేతా న్నిరీక్షేహం
యోద్ధుకామానవస్థితాన్,
కైర్మయా సహయోద్ధవ్య
మస్మిన్‌ రణసముద్యమే.

అర్జునుడు చెప్పెను. ఓ కృష్ణా! ఈ యుద్ధారంభమునందు నేనెవరితో పోరుసలపవలయునో, అట్టి ఈ యుద్ధాభిలాషులను ఎచటినుండి నేను చక్కగ జూడగల్గుదునో రెండు సేనలమధ్య అచ్చోట నా రథమును నిలబెట్టుము. 

యోత్స్యమానానవేక్షేహం
య ఏతేత్ర సమాగతాః,
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే
ర్యుద్ధే ప్రియచికీర్షవః.

దుష్టబుద్ధిగల దుర్యోధనునకు యుద్ధమున ప్రియమొనగూర్చనెంచి ఇచట చేరియున్నట్టి ఈ యోధులను నేను చూచెదను.

సంజయ ఉవాచ :-

ఏవయుక్తో హృషీకేశో
గుడాకేశేన భారత!
సేనయోరుభయోర్మధ్యే
స్థాపయిత్వా రథోత్తమమ్‌.

భీష్మద్రోణ ప్రముఖత
స్సర్వేషాం చ మహీక్షితామ్‌,
ఉవాచ పార్థ! పశ్యైతాన్‌
సమవేతాన్‌ కురూనితి

సంజయడిట్లు పలికెను. ఓ ధృతరాష్ట్ర మహారాజా అర్జునుడిట్లు చెప్పగా నంతట శ్రీకృష్ణుడు ఉత్తమమగు ఆ రథమును రెండుసేనల మధ్య భీష్మద్రోణులకును, ఎల్లరాజులకును ఎదుట నిలిపి 'అర్జునా! ఈ చేరియున్న కౌరవులను జూడుము!' అని చెప్పెను.

తత్రాపశ్యత్థ్సితాంపార్థః
పితౄనథ పితామహాన్‌,
ఆచార్యాన్మాతులాంభ్రతౄన్‌
పుత్రాంపౌత్రాంసఖీంస్తథా.

శ్వశురాంసుహృదశ్చైవ
సేనయోరుభయోరపి

తదుపరి అర్జునుడచట రెండుసేనలయందును నిలిచి యున్నట్టి తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, అన్నదమ్ములను కొడుకులను మనుమలను, స్నేహితులను, మామలను, హితైషులను (అందరిని) చూచెను.

తాంసమీక్ష్య స కౌంతేయ
స్సర్వాన్‌ బంధూనవస్థితాన్‌.

కృపయా పరయావిష్టో
విషీదన్నిదమబ్రవీత్‌,

అర్జునుడు యుద్ధభూమియందు నిలబడియున్న ఆ బంధువులందరిని బాగుగ పరికించి దయార్ద్ర హృదయుడై దుఃఖించుచు నిట్లుపలికెను. 

అర్జున విషాదయోగః 2 (అథ ప్రథమోధ్యాయః, శ్రీ భగవద్గీత

అర్జున విషాదయోగః 2 (అథ ప్రథమోధ్యాయః, శ్రీ భగవద్గీత)

అపర్యాప్తం తదస్మాకం
బలం భీష్మాభిరక్షితమ్‌,
పర్యాప్తం త్విదమేతేషాం
బలం భీమాభిరక్షితమ్‌

అట్టిశూరులు కల మన సైన్యము భీష్మునిచే గాపాడబడుచు అపరిమితముగనున్నది. (అజేయమైయొప్పచున్నది) పాండవుల యొక్క ఈ సేనయో భీమునిచే రక్షింపబడుచు పరిమితమగనున్నది. (జయింపశక్యమైయున్నది)

అయనేషు చ సర్వేషు
యథా భాగమవస్థితాః,
భీష్మ మేవాభిరక్షంతు
భవంతస్సర్వ ఏవ హి.

మీరందరున్ను ప్యూహమార్గములందు మీ మీ నియమిత స్థానములందుండి భీష్మునే సర్వవిధముల కాపాడుచుండవలయును.

తస్య సఞ్జనయన్‌ హర్షం
కురువృద్ధః పితామహః,
సింహనాదం వినద్యోచ్చై
శ్శజ్ఖం దధ్మౌ ప్రతాపవాన్‌.

పరాక్రమశాలియు, కురువృద్ధుడునగు భీష్మ పితామహుడంతట దుర్యోధనున కుత్సాహము గలుగునటుల పెద్దగ సింహధ్వని జేసి శంఖమును వూరించెను.

తత శ్శజ్ఖాశ్చ భేర్యశ్చ
పణవానక గోముఖాః,
సహసై వాభ్యహన్యంత
స శబ్దస్తుములో భవత్‌.

భీష్ముడు శంఖారావము చేసిన పిమ్మట కౌరవ సైన్యమందలి తక్కినవారున్ను శంఖములను, భేరులను, తప్పెటలు మున్నగువానిని వెంటనే మ్రోగించిరి. ఆ శబ్దముచే దిక్కులు పిక్కటిల్లెను.

తత శ్శ్వేతైర్హయైర్యుక్తే
మహతి స్యందనే స్థితౌ,
మాధవః పాణ్డవశ్చైవ
దివ్యౌ శజ్ఖౌ ప్రదధ్మతుః.

పిమ్మట తెల్లని గుర్రములబూంచిన గొప్ప రథము అందు గూర్చొనియున్న కృష్ణార్జును లిరువురును తమ తమ దివ్యములగు శంఖములను గట్టిగ ఊదిరి.

పాఞ జన్యం హృషీకేశో
దేవదత్తం ధనఞ్జయః,
పౌణ్డ్రం దధ్మౌ మహాశజ్ఖం
భీమకర్మా వృకోదరః

అనంతవిజయం రాజా
కుంతీపుత్రో యుధిష్ఠిరః,
నకుల స్సహదేవశ్చ
సుఘోష మణిపుష్పకౌ.

కాశ్యశ్చ పరమేష్వాస
శ్శిఖణ్డీ చ మహారథః,
ధృష్టద్యుమ్నో విరాటశ్చ
సాత్యకిశ్చా పరాజితః

ద్రుపదో ద్రౌపదేయాశ్చ
సర్వశః పృథివీపతే,
సౌభద్రశ్చ మహాబాహు
శ్శజ్ఖాన్‌ దధ్ముఃపృథక్పృథక్‌

శ్రీ కృష్ణుడు పాంచజన్యమను శంఖమును ఊదెను. అర్జునుడు దేవదత్తమును ఊదెను. భయంకర కార్యములనొనర్చు భీముడు పౌండ్రమను గొప్ప శంఖమును ఊదెను. కుంతీసుతుడగు ధర్మరాజు అనంతవిజయమును, నకులుడు సుఘోషమును, సహదేవుడు మణిపుష్పకమును ఊదిరి. అట్లే గొప్ప ధనుస్సుగల కాశీరాజున్ను, మహారథుడగు శిఖండియు, ధృష్టద్యుమ్నుడును, విరటుడును, అపజయమునొందని వాడగు సాత్యకియు, ద్రుపదుడును, ద్రౌపదీ తనయులగు ఉపపాండవులును, గొప్ప భుజబలముగల అభిమన్యుడును సేవయందంతట వేరు వేరుగా తమ తమ శంఖములను ఊదురి. 

అర్జున విషాదయోగః 1 (అథ ప్రథమోధ్యాయః, శ్రీ భగవద్గీత)

అర్జున విషాదయోగః 1 (అథ ప్రథమోధ్యాయః, శ్రీ భగవద్గీత)

ధృతరాష్ట్ర ఉవాచ : -

ధర్మక్షేత్రే కురుక్షేత్రే
సమవేతా యుయుత్సవః,
మామకాః పాణ్డవాశ్చైవ
కిమకుర్వత సంజయ!

ధృతరాష్ట్రుడిట్లు పలికెను: ఓ సంజయా! నా వారలగు దుర్యోధనాదులను, పాండుపుత్రులగు ధర్మరాజాదులను యుద్ధము చేయ కుతూహలముతో పుణ్యభూమి యగు కురుక్షేత్రమున జేరి యేమిచేసిరి?

సంజయ ఉవాచ :-

దృష్ట్వా తు పాణ్డవానీకం
వ్యూఢం దుర్యోధన స్తదా‌,
ఆచార్యముపసజ్గమ్య
రాజా వచనమబ్రవీత్‌.

ధృతరాష్ట్రునితో సంజయడిట్లు వచించెను :- అపుడు రాజైన దుర్యోధనుడు ప్యూహాకారము గాంచింపబడియున్న పాండవసేనను చూచి, తదుపరి గురువగు ద్రోణాచార్యుని సమీపించి యిట్లు పలికెను.

పశ్యైతాం పాణ్డుపుత్రాణా
మాచార్య మహతీం చమూమ్‌,
వ్యూఢాం ద్రుపదపుత్రేణ
తవ శిష్యేణ ధీమతా.

ఓ గురువర్యా! బుద్ధిశాలియు, మీ శిష్యుడునగు ధృష్టద్యుమ్నునిచేత ప్యూహాకారముగ రచింపబడియునట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమునుజూడుడు!

అత్రశూరా మహేష్వాసా
భీమార్జున సమా యుధి,
యుయుధానో విరాటశ్చ
ద్రుపదశ్చ మహారథః.

ధృష్ట కేతు శ్చేకితానః
కాశీరాజశ్చ వీర్యవాన్‌,
పురుజిత్కుంతి భోజశ్చ
శైబ్యశ్చ నరపుజ్గవః

యుధామన్యుశ్చ విక్రాంత
ఉత్తమౌజాశ్చ వీర్యవాన్‌,
సౌభద్రో ద్రౌపదేయాశ్చ
సర్వ ఏవ మహారథాః

ఈ పాండవసేనయందు గొప్ప విలుకాండ్రును, యుద్ధమునందు భీమార్జునులతో సమానులునగు శూర వీరులును పెక్కురు కలరు. వారెవరనిన - యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడగు కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరోత్తముడగు శైబ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు. వీరందరును మహారథులే అయియున్నారు.

అస్మాకం తు విశిష్టా యే
తాన్నిబోధ ద్విజోత్తమ,
నాయకా మమ సైన్యస్య
సంజ్ఞార్థం తాన్‌ బ్రవీమి తే.

ఓ బ్రాహ్మణోత్తమా! ఇక మనసైన్యములో ప్రముఖులు, సేనానాయకులు ఎవరు కలరో వారలను జ్ఞాపకము కొరకు మీకు చెప్పుచున్నాను.(వినుడు)

భవాన్‌ భీష్మశ్చ కర్ణశ్చ
కృపశ్చ సమితింజయః,
అశ్వర్థామా వికర్ణశ్చ
సౌమదత్తి స్తథైవ చ

అన్యే చ బహవశ్శూరా
మదర్థే త్యక్తజీవితాః,
నానాశస్త్ర ప్రహరణా
స్సర్వే యుద్ధవిశారదాః.

మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వర్థమ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకను నాకొరకు తమ తమ జీవితములను ధారబోయునట్టి అనేక ఇతర శూరులు, అందరును యుద్ధసమర్థులై వివిధ శస్త్రాస్త్ర సంపన్నులై ఇచట నున్నారు. 

మోక్షసన్యాస యోగం(18 వ అధ్యాయం)

మోక్షసన్యాస యోగం(18 వ అధ్యాయం)

అర్జునుడు:
కృష్ణా!సన్యాసము,త్యాగము అంటే ఏమిటి?వివరంగా చెప్పు?

కృష్ణుడు:
కోరిక చే చేయు కర్మలను మానడం సన్యాసమనీ,కర్మఫలితాలు విడిచిపెట్టడమే త్యాగమని పండితులు అంటారు.కర్మలన్నీ బంధ కారణాలే కనుక చేయకపోవడమే మంచిదని కొందరు,యజ్ఞ,దాన తపస్సులను విడవకూడదని కొందరు అంటారు.

త్యాగ విషయంలో నా అభిప్రాయం ఏమంటే చిత్తశుద్దిని కల్గించు యాగ,దాన,తపస్సులను మూడు కర్మలు ఎన్నడూ విడవరాదు.వాటిని కూడా మమకారం లేక,ఫలాపేక్ష లేక చెయ్యలని నా అభిప్రాయం.

కర్తవ్యాలను విడిచిపెట్టడం న్యాయం కాదు.అలా విడవడం తామస త్యాగం. శరీరకశ్టానికి భయపడి కర్మలు మానడం రాజస త్యాగం.ఫలితం శూన్యం.

శాస్త్రకర్మలు చేస్తూనే ఆసక్తినీ,కర్మఫలాన్నీ విడిస్తే అది సాత్వికత్యాగం.ఇలా చేయువాడు,సందేహాలు లేనివాడు ఆత్మజ్ఞాని దుఃఖాలను ఇచ్చే కర్మలను ద్వేషింపడు.సుఖాన్నిచ్చే కర్మలను ఆనందింపడు. శరీరం కల్గినవారు కర్మలను వదలడం అసాధ్యం.కాబట్టి కర్మఫలితాన్ని వదిలేవాడే త్యాగి.

ఇష్టము,అనిష్టము,మిశ్రమము అని కర్మఫలాలు మూడు రకాలు.కోరిక కల్గిన వారికి ఆ ఫలితాలు పరలోకంలో కలుగును.కర్మఫలత్యాగులకు ఆ ఫలితాలు అందవు. శరీరం,అహంకారం,ఇంద్రియాలు,ప్రక్రియా పరమైన వివిధ కార్యాలు,పరమాత్మ అను ఈ ఐదే అన్ని కర్మలకూ కారణమని సాంఖ్య శాస్త్రం చెప్తోంది. మనస్సు,మాట,శరీరాలతో చేసే అన్ని మంచి,చెడు కర్మలకూ ఈ ఐదే కారణము.ఈ విషయాలు తెలియనివారు,చెడ్డ భావల వారు మాత్రం తమే చేస్తున్నట్టూ అహంకారంతో తిరుగుతారు. తను పని చేస్తున్నానన్న అహంకారం లేనివాడు,అజ్ఞానం లేనివాడు ఈ లోకం లో అందరినీ చంపినా సరే - ఆ పాపం వారికి ఏ మాత్రమూ అంటదు. జ్ఞానం,జ్ఞేయం,పరిజ్ఞాత అని మూడు కర్మ ప్రోత్సాహకాలు.అలాగే కర్త,కర్మ,సాధనం అని కర్మ సంగ్రహం మూడు రకాలు. జ్ఞానం,కర్మ,కర్త అనేవి సాంఖ్యశాస్త్రం ప్రకారం మూడేసి విధాలుగా ఉన్నాయి.వాటిని విను. విభిన్నంగా కనపడే అన్ని జీవులలో అవినాశమై,మార్పు లేని,ఒక్కటిగా ఉన్న ఆత్మను గ్రహించే జ్ఞానమే సాత్విక జ్ఞానం. ఎన్ని జీవులుంటే అన్ని ఆత్మలు ఉన్నాయనడం రాజస జ్ఞానం. ఏది చూస్తే అదే సర్వమని అనుకొనే జ్ఞానం తామసజ్ఞానం. అభిమాన,మమకార,ద్వేషం లేక ఫలాపేక్ష లేక చేయు విధిపూర్వక కర్మలు సాత్వికం.

ఫలితం పైన ఆసక్తితో,అహంకార అభిమానాలతో,చాలా కష్టంతో చేయునవి రాజసకర్మలు. మంచిచెడ్డలను,కష్టనిష్ఠూరాలను గమనింపక మూర్ఖంగా చేయు పని తామసకర్మ. ఫలితం పైన ఆశ పెట్టుకోకుండా,నిరహంకారియై,ఫలితం లోని మంచిచెడ్డలకు ప్రభావితం కాక ధైర్యోత్సాహాలతో పని చేయువాడు సాత్వికకర్త. ఫలితం పైన ఆశతో,అభిమానంతో,లోభగుణంతో,హింసతో,అశుచిగా,సుఖదుఃఖాలకు చలిస్తూ పని చేయువాడు రాజసకర్త. ధైర్యం పోగొట్టుకొని,మూర్ఖత్వంతో,మోసంతో,దీనమనస్సు తో,వృథా కాలయాపంతో పనిచేయువాడు తామసకర్త. బుద్ధి,ధృతి అనే ఈ రెండూ గుణబేధాలచే మూడు విధాలు. ధర్మాధర్మములందు ప్రవృత్తి నివృత్తులను-కర్తవ్యాకర్తవ్యాలను-భయాభయాలను-బంధనమోక్షాలను స్పష్టంగా తెలుసుకోగలిగినదే సాత్వికబుద్ధి. ధర్మాధర్మాలు,కార్యాకార్యాలు నిజజ్ఞానాన్ని కాక పొరపాటుగా గ్రహించేది రాజసబుద్ధి. ప్రతిదాన్ని వ్యతిరేకంగా గ్రహించేది తామసబుద్ధి. మనసు,ప్రాణం,ఇంద్రియాల వృత్తులను నిగ్రహించి చెదిరిపోకుండా నిలిపే పట్టుదలను సాత్విక ధృతి అంటారు. ఫలితంపై అధిక ఆసక్తి,ధర్మ,అర్థ,కామాలందు చూపే అధిక పట్టూదలే రాజస ధృతి. కల,భయం,బాధ,విషాదం,గర్వం వీటికి లోనవుతూ కూడా మూర్ఖపు పట్టుదలను వీడనిది తామసికధృతి. సుఖాలు మూడు విధాలు.

మొదట దుఃఖకరమైనా సాధన చేస్తున్నకొద్దీ సులవు అనిపించి,ఇబ్బందులు తొలగి చివరికి ఎనలేని ఆనందం ఇస్తుందో-ఆ అమృతమయబుద్ధితో జన్మించేదే సాత్విక సుఖం. ఇంద్రియ సంయోగం వలన పుట్టేదీ,మొదట అమృతంగా ఉన్నా చివరికి విషం అయ్యేది రాజససుఖం. ఎప్పుడూ మోహింపచేస్తూ,నిద్ర,ఆలస్య,ప్రమాదాలతో కూడినది తామస సుఖం. త్రిగుణాలకు అతీతమైనది ఏదీ భూ,స్వర్గ లోకాలలో,దేవతలలో ఎక్కడా ఉండదు. స్వభావ గుణాలను అనుసరించి నాలుగు వర్ణాలవారికీ కర్మలు వేర్వేరుగా విభజింపబడ్డాయి. బాహ్య,అంతర ఇంద్రియనిగ్రహం,తపస్సు,శౌచం,క్షమ,సూటిస్వభావం,శాస్త్రజ్ఞానం, అనుభవజ్ఞానం మొదలగునవి స్వభావంచే బ్రాహ్మణ కర్మలు. శౌర్యం,తేజస్సు,ధైర్యం,వెన్ను చూపనితనం,సపాత్రదానం,ఉత్సాహశక్తులు క్షత్రియ కర్మలు. వ్యవసాయం,గోరక్షణ,వ్యాపారం వైశ్యులకు-సేవావృత్తి శూద్రులకు స్వభావ కర్మలు. తన స్వభావకర్మలను శ్రద్ధాసక్తులు కలిగి ప్రవర్తించేవాడు జ్ఞానయోగ్యతారూప సిద్ధిని పొందుతాడు. పరమాత్మను తనకు విధింపబడిన కర్మలచే ఆరాధించేవాడు చిత్తశుద్ధిని పొందుతాడు. బాగా చేసే పరధర్మం కన్నా దోషం చే చేసే స్వధర్మం చేయడమే మంచిది. స్వధర్మం దోషంతో ఉన్నా విడవరాదు.అగ్నిని పొగ ఆవరించి ఉన్నట్టూ అన్ని ధర్మాలూ ఏదో ఒక దోషం కలిగిఉంటాయి. విషయాసక్తి లేనివాడు,ఇంద్రియనిగ్రహీ,చలించనివాడూ జ్ఞానమార్గం చే నైష్కర్మ్యసిద్ధిని పొందుతాడు. నిష్కామ కర్మచే జ్ఞానసిద్ధిని పొందినవాడు పరమాత్మను పొందేవిధానం చెపుతాను విను. మాయ లేని నిశ్చలజ్ఞానంతో మనసును నిగ్రహించి,శబ్దాదివిషయాలను వదిలి,రాగద్వేష రహితుడై,నిత్యమూ విరాగియై,యేకాంత వాసంతో,అల్పాహారియై,మనస్సు,మాట,శరీరాలల్ను నియమబద్దం చేసి,ధ్యానయోగియై,అహంకార,అభిమాన,కామ,క్రోధాలను వదిలి,విషయస్వీకారం విడిచి,మమకారంలేనివాడై,శాంతచిత్తం కల్గినవాడే బ్రహ్మభావానికి అర్హుడు. బ్రహ్మజ్ఞాని దేనినీ కోరడు.దేనికీ దుఃఖించడు.అన్ని భూతాలందూ సమదృష్టి కల్గి నా భక్తిని పొందుతాడు. ఆ భక్తిని పొందినవాడు నన్ను పూర్తిగా గ్రహించి ఆ భక్తితోనే నాలో ఐక్యం అవుతాడు. అన్ని పనులు చేస్తున్నా,నన్నే నమ్మిన కర్మయోగి నా పరమపదమే పొందుతాడు. అన్ని కర్మలూ నాకే అర్పించి సమబుద్దిరూపమైన యోగం చెయ్యి.నేనే పరమగతినని తెలుసుకొని నీ మనసును నాలోనే లగ్నం చేయి. నన్ను శరణు కోరితే నా అనుగ్రహంతో సంసారాన్ని తరిస్తావు.కాదని అహంకరిస్తే నాశనమవుతావు. యుద్దం చేయకూదదని నీవనుకున్నా నీ నిర్ణయం వృథానే.ఎందుకంటే నీ క్షత్రియధర్మమే నిన్ను యుద్దానికి ప్రేరేపిస్తుంది. సర్వభూతాలనూ తన మాయచే కీలుబొమ్మలలా ఆడిస్తూన్న ఈశ్వరుడు అందరి హృదయాలలో ఉన్నాడు. అతడినే అన్నివిధాలా శరణు వేడు.అతని దయచే శాంతి,మోక్షం పొందుతావు. అతిరహస్యమైన జ్ఞానాన్ని నీకు చెప్పాను.బాగా ఆలోచించి నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. నా యందు మనసు కలిగి,నన్నే భక్తితో సేవించు.నన్నే పూజించు.నమస్కరించు.నీవు నాకు ఇష్టం కావున నీతీ ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను.నిశ్చయంగా నువ్వు నన్నే పొందుతావు. అన్ని ధర్మాలనూ వదిలి నన్నే శరణువేడు.నిన్ను అన్ని పాపాలనుండీ బయటపడవేస్తాను. తపస్సులేని వాడికీ,భక్తుడు కాని వాడికీ,సేవ చేయని వాడికీ,నన్ను అసూయతో చూసేవాడికీ ఈ శాస్త్రాన్ని చెప్పరాదు. అతిరహస్యమైన ఈ గీతాశాస్త్రాన్ని నా భక్తులకు అందించేవాడు,నిశ్చయంగా నా పరమాత్మ భావాన్ని పొందుతాడు. ఈ గీతాశాస్త్రప్రచారకుడికన్నా ఎక్కువైన భక్తుడు కానీ,ప్రియుడుకానీ,ఈ లోకంలో నాకు మరొకడు లేడు. మన సంవాదరూపమైన ఈ గీతను ఎవడు పారాయణ చేస్తాడో వాడివలన నేను జ్ఞానయజ్ఞంచే ఆరాధింపబడినవాడిని అవుతున్నాను. శ్రద్దాసక్తి తో,అసూయలేక దీనిని విన్నవారు గొప్పగొప్ప పుణ్యాలు చేసినవారు పొందే లోకాలను తేలికగా పొందుతారు. ఇంతవరకూ నేను చెప్పినది మనసు లగ్నం చేసి విన్నవా?నీ మోహం నశించినదా? 

అర్జునుడు:
నీ దయవలన నా అజ్ఞానం తీరింది.సందేహం పోయింది.ఆత్మజ్ఞానం కల్గింది.నువ్వేమి చెప్తే అది చేయడానికి సిద్దంగా ఉన్నాను.

సంజయుడు:
ధృతరాష్ట్ర మహారాజా!మహాత్ములైన శ్రీకృష్ణార్జునుల సంవాదం నేను విన్నాను.పులకించాను. శ్రీవ్యాసుల దయచేత యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పిన యోగశాస్త్రాన్ని ప్రత్యక్షంగా వినే భాగ్యం నాకు కలిగింది.ఆ సంవాదం మాటిమాటికీ మా మనస్సును ఉప్పొంగిస్తోంది.ఆ అద్భుత విశ్వరూపం తలుచుకుంటుంటే నా ఆనందం అధికమవుతోంది. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు,ధనుర్ధారి ఐన అర్జునుడూ ఎక్కడ ఉంటారో అక్కడే లక్ష్మీదేవి,విజయమూ,ఐశ్వర్యమూ ఉంటాయనేది నా దృఢనిశ్చయము.